ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమద్రామాయణము : ఉత్తరకాండము
ఇరువది తొమ్మిదవ సర్గ
పద్యానువాదకులు:
మధురకవి గుండు మధుసూదన్

[రావణుఁడు దేవతల సైన్యమునుండి బయటకుఁ బోవుట – అతనిఁ బట్టుకొనుటకై దేవతలు ప్రయత్నించుట – ఇంతలో మేఘనాదుఁడు మాయా ప్రయోగముచేత నింద్రుని బంధించి, విజయవంతుఁడై సైన్యముతో లంకకుఁ బ్రయాణమగుట]
రాక్షసులు చెలరేఁగి పరస్పరమ్ము
బలమదోన్మత్తులై నశింపంగఁజేసి
కొనుచు యుద్ధ మ్మొనర్చిరి కుపితు లగుచు! 29.1
ఆ మహాయుద్ధమందున నసుర కలిత
మౌ బృహత్సైన్యమందు, దశాంశ మచట
శేష మగునట్లు ఖచరులు సేసి, మిగిలి
నట్టి సైన్యమున్ యమపురి కంపి రపుడు! 29.2
అంధకారావృతంపు జన్యమ్మునందు
దేవరాక్షసు లొండొరుల్ ద్రెక్కలిగొను
చుండ్రిగాని, పరస్పర సూక్ష్మదృక్కుఁ
బఱపి పరిపంథి నెఱుఁగంగ వలవరైరి! 29.3
అంధకారబంధురమగు నా దురమున
బల్లిదుండ్రౌ త్రితయ వీర వరులునైన
యింద్రజిద్రావణేంద్రులే యెట్టి మోహ
జాలమందుఁ జిక్కకయుండ్రి సర్వులందు! 29.4
అంత నా రావణుఁడు తనవైన బలము
లన్ని క్షణకాలమందున నంతమగుటఁ
గనియు, నాగ్రహోదగ్రుఁడై, ఘనము గాను
సింహగర్జన సేసె నా చివ్వయందు! 29.5
పిదప దుర్ధర్షుఁడౌ సురద్విషవిభుండు
క్రోధమున రథసారథిం గూర్చి యిటులఁ
బలికె “రథముఁ, బ్రతిద్వంద్విపక్షమంత
నాశమౌ దాఁక, నడుమన నడుపుమయ్య! 29.6
ఇప్పు డేను స్వయముగ ననేకవిధము
లైన శస్త్రసారముతోడ, నమర వితతిఁ
జంపి, యమలోకముం జేర్తు, శౌర్యము వెలుఁ
గొందు నట్టులఁ బోరున నుద్యమించి! 29.7
నేన స్వయముగా యుద్ధాన నిక్కముగను
యమవరుణధనదేంద్రుల హతమొనర్చి,
పిదప దేవత లందఱ బెండుపఱచి,
పరఁగ ముల్లోకములకధిపతినగుదును! 29.8
’విమత తతి మధ్య రథచోదన’ మని భయము
నందకుము! శీఘ్రముగఁ ద్రోలు మరద మిపుడ!
మఱలఁ జెప్పెద, రథము, విమత నిచయము
నాశమౌదాఁక, నడుమన నడుపుమయ్య! 29.9
వినుము! మనమున్న యిద్ది నందనవనభువి!
కనఁగ సురసేన యుదయాద్రి కడ దనుకను
వ్యాప్తమైయుండెఁ! గానఁ, దత్పర్వతమ్ము
దాఁక విజయింతుఁ, గొనిపొమ్మ త్వరితముగను!” 29.10
అనిన రావణు వచనమ్ము లాలకించి,
వెసను రథసారథియు మనోవేగముగల
తురగములఁ బూన్చినట్టి యా యరద మపుడ
శత్రుమధ్యదేశమునకుఁ జాఁగఁ ద్రోలె! 29.11
అపుడు దేవేశ్వరుండైన యద్రిభిదుఁడు,
రావణుని నిశ్చయము విని, రణభువిఁ గల
రథమునందుండి, యచటి నిర్జరులతోడఁ
దనదు వ్యూహమ్ము నిట్టులఁ దగఁ బలికెను! 29.12
“వినుఁడు సురలార! యెయ్యది ప్రియము నాకుఁ
గూర్చునో, యట్టి వాక్యమ్ముఁ గూర్చి మీకుఁ
జెప్పెదను! పంక్తికంఠు సజీవునిగను
బంధితునిఁ జేయవలెను గీర్వాణులార! 29.13
కడు బలాధికుఁడగు దశకంఠుఁడు రథ
మందు నారూఢుఁడై వచ్చి, మనపయిఁబడి,
పౌర్ణమిని విజృంభించెడి వారినిధి ల
హరిని వలె విజృంభించి, నుగ్గాడఁగలఁడు! 29.14
వరబలోన్నతాభయుఁడైన వానిఁ జంప,
మన మశక్తుల మగుదుము! కనుక, వాని
సంయుగమ్మున బంధింపఁ జక్కనయగుఁ!
దత్ప్రయత్నమ్మునకు మీరు తరలుఁడయ్య! 29.15
బలినిఁ బాతాళమున హరి బంధితునిగఁ
దగ నొనర్పఁగ, నేను ముజ్జగము లనుభ
వించుచున్నట్లు, పాపాత్ము వీని నటులె
బంధితునిఁ జేయవలెనని పలుకుచుంటి!" 29.16
వేలుపులతోడ నిట్లని వేలుపుదొర,
బంతిమోములదొరతోడి బవరము విడి,
వేరు తలమునకుం జని, బీతు గలుగఁ
బోరు మొదలిడె రక్కసి మూఁకతోడ! 29.17
అని నివర్తితుఁడుం గాక యాశిరపతి,
యుత్తరమునుండి చొఱఁబడఁ దత్తబడను,
నతనిఁ గనుచును నిఁక సహస్రాక్షుఁ డంత,
క్షిప్రమే ప్రవేశించె దక్షిణమునుండి! 29.18
అంత యోజనశతదూర మాశిరపతి,
దివిజ సైన్యానఁ జొచ్చియు, స్థిరబలయుతుఁ
డగుచు, వారలపయిని శస్త్రాస్త్రవర్ష
మునుఁ గుఱియఁజేసెఁ, జీకాకుఁ గొనఁగఁ జేసి! 29.19
అపుడు శక్రుండు తనసేన లంతమగుటఁ
గనియు, విభ్రాంతి నందక, వెనుకనుండి
వచ్చి, రావణు ముట్టుకోల్పఱచి, యుద్ధ
విముఖుఁ గావించె సరగున విక్రమించి! 29.20
ఇవ్విధమ్మున దైత్యేంద్రు నింద్ర శౌర్య
గ్రస్త దుస్థితి నీక్షించి రాక్షసులును,
దనుజు లపుడు “హా! చచ్చితి” మనెడి ధ్వనులు
వెడలఁ గ్రక్కిరి యగ్రోగ్రవిగ్రహమున! 29.21
అంతఁ గ్రోధసమ్మోహితుం డయిన మేఘ
నాదుఁ డత్యాగ్రహమున స్యందనము నెక్కి,
యతిభయంకర సురసైన్యమందు, మిగుల
వడిగఁ దాఁ బ్రవేశించెను బడలువాప! 29.22
తనకుఁ దొల్లి ముక్కంటి యిచ్చిన వరమగు
మాయనుం బూని, యతఁడు సంరంభమునను
దేవతల సైన్యమునఁ దూఱ, దివిజు లపుడు,
సమర రంగమ్మువిడి, పాఱి, చనిరి వేగ! 29.23
పాఱిపోయెడి సైన్యమున్ వదలి, యతఁడు
దేవతలఱేనిఁ గూర్చియుం బోవ, నపుడు
మిగుల తేజస్వి బలశాలియగు మఘవుఁడు,
తనదు రిపుసూను నచ్చటఁ గనుఁగొనఁడయె,
నింద్రజిచ్ఛాంబరీకృతసాంద్రమహిమ! 29.24
ఘనబలాఢ్యులు నగునట్టి దనుజ రిపులు,
ముక్త కవచుఁడౌ రావణిన్ మొత్తినను, న
తండు, వారల కేమియు దబ్బ ఱిడక,
భయము నందక నిలిచెను భండనమున! 29.25
అప్పు డా మేఘనాదుండు, నమర విభుని
సారథియగు మాతలి నట శరవరతతి
చేతఁ బ్రహరించి, యటులె వజ్రిపయిఁగూడ
బాణవర్షమ్ముఁ గుఱిపించె హృణిపెనుపున! 29.26
పిదప శక్రుండు రథమును విడచి, యటులె
సారథినిఁ బంపి, సితసామజప్రభు పయి
నధివసించి, రావణికయి, యచట నిచట
వెదుకఁ దొడఁగె, నాతనియొక్క బేలు కతన! 29.27
అతఁడు మాయా బలముచేత నచటఁ గానఁ
బడకయున్నట్టివాఁడయి, యుడుపథమ్ముఁ
జేరి, హరిని మాయాపరిక్షిప్తునిగను
జేసి, శరవర్షియై పర్వె శీఘ్రముగను! 29.28
కొంత వడికి రావణియె, శక్రుఁ డలసెనని
తెలిసి, తన మాయచేత బంధించి, పిదపఁ,
దనదు సైన్యమ్ము చెంత కాతనినిఁ దీసి
కొని వెడలెఁ, దాను వీరత్వమున నడరుచు! 29.29
అటుల వానిచే ఘన రణమందునుండి,
బలిమిఁ గొంపోవఁబడు నింద్రుఁ బరఁగఁ జూచి,
యమరు, “లేమగునో గదా!” యని మనములఁ
జింతనము సేయఁ దొడఁగిరి చేష్టలుడిగి! 29.30
“అసురు లందఱి మాయల నణఁచునట్టి
విద్య గల యింద్రునిం బట్టి, వెంటఁగొనుచుఁ
బోవు మాయావి, రావణు పుత్రుఁ, డిచట
నగపడుట లేదె!” యంచుఁ దా మనుకొనిరయ! 29.31
ఇటులఁ దలఁచుచు దేవతాపటలి మిగులఁ
బ్రతిఘమునుఁగొని, యప్పుడు రావణు పయి,
రణ విముఖుఁడునౌనటుల, మార్గణపు వృష్టిఁ
గుఱియఁజేసెను మిగులంగఁ, గోరి యనిని! 29.32
రావణుం డని, నాదిత్యులను, వసువుల
నెదురుకొనియును, వారిపై నెగ్గలేక,
వారి చేతను బీడింపఁబడుచు, బవర
మొనరఁ జేయఁజాలకయుండెఁ, గనఁగ నపుడు! 29.33
మిగుల మ్లానుఁడై, యుద్ధానఁ బగఱచేత
దెబ్బతిన్నట్టివాఁడునై, దీనముగను
నున్న తండ్రిని వీక్షించి, యుగ్రుఁడగుచు,
నింద్రజి చ్ఛాంబరిని వీడి, యిటులఁ బలికె! 29.34
“పోయెదము రమ్ము, తండ్రి! యీ పోరునాపి!
మనకె విజయమ్ము లభియించెనని తెలియుము!
స్వస్థుఁడవు కమ్ము, మనమున వ్యథలు నన్ని
తొలఁగి చనునట్లు, సంతస మొలుక నీవు! 29.35
అమరులకు, ముజ్జగములకు నధిపతియగు
వజ్రి, నమర సైన్యము నుండి బంధితునిగఁ
బొనరిచియు, దేవతల గర్వములును దొలఁగు
నట్లు సేసితి యుద్ధమ్మునందు నేను! 29.36
తండ్రి! యిఁక నీవు మండ్రాటకాండ్ర, నీదు
తేజ మలరఁగ నణఁచియుఁ, దిరముగాను,
మూఁడు లోకాల ననుభవింపుమయ! యిప్డు
వ్యర్థమైనట్టి యుద్ధంపు టలుపు లేల?” 29.37
ఇంద్రజి ద్వాక్యములు విని, ఋభువు లపుడు,
పెనఁకువల నుండి విరమించి, వెనుదిరిగిరి!
ప్రభుఁడు దేవేంద్రుఁడే లేని వార, లటులఁ
గాక, మఱియె ట్లొనర్తురు కదనమందు? 29.38
అనివిగతుఁడు, నుత్తమతేజుఁ, డమరవైరి,
సుప్రసిద్ధుఁడౌ రాక్షసేశుండు, తనదు
నాత్మజుఁడు వల్కు ప్రియవాక్కు లన్ని వినియు,
మన్ననల మాటలను నిట్లు సన్నుతించె! 29.39
“అతిబల! ప్రభు! నీదు పరాక్రమమున,
నాదు కులవంశవృద్ధినొందంగఁజేసి;
తిప్పు డతులబలుండవై, యిట్టి యింద్రు,
నటులె త్రిదశుల గెలిచితి వయ్య నీవు! 29.40
వత్స! నీవిప్డు రథమందు వాసవు నధి
రోపణముఁజేసి, సేనతోఁ, బ్రోలికరుఁగు;
మేను మన్మంత్రిసహిత సంహృష్టుఁడనయి
శీఘ్రమే వత్తు నీ వెన్క, జితమహేంద్ర!” 29.41
అనఁగ, వీరుఁ డా రావణి, యమరవిభునిఁ
గొని, బలవృతుఁడై, తనదు భవనముఁగూర్చి,
వాహనమునందుఁ గూర్చొని, ప్రమదముననుఁ
జనియు, దనుజులఁ దమ యిండ్లకును బనిచెను! 29.42
[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు నుత్తరకాండ మందలి యిరువది తొమ్మిదవ సర్గము సమాప్తము]
స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్
