11, జులై 2018, బుధవారం

శ్రీమద్రామాయణము : ఉత్తరకాండము - త్రయోదశ సర్గ

ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమద్రామాయణము : ఉత్తరకాండము
త్రయోదశ సర్గ

పద్యానువాదకులు:
మధురకవి గుండు మధుసూదన్

image of sri rama hd కోసం చిత్ర ఫలితం


[రావణుఁడు నిర్మింపఁజేసిన శయనగృహమునఁ గుంభకర్ణుఁడు శయనించుట, రావణుని దురాగతములు, కుబేరుఁడు దూతనుఁ బంపి, రావణున కుపదేశమొనరించుట, రావణుం డా దూతను చంపించుట]

అనె నగస్త్యుఁడు రామున కపుడు "రామ!
పిదప నొక కొంత కాలాన వేధ ప్రేరి
తమగు తీవ్ర నిద్రయ యప్డు తన మహిమను,
జృంభ రూపాదులనుఁ గొని, చేరి, కుంభ
కర్ణు నావహించెను తమకమున మిగుల! 13.1

అంతఁ గుంభకర్ణుఁడు చని, యాసనమునఁ
గూరుచొనియున్న నగ్రజుఁ గూర్చి "రాజ!
నన్నుఁ బెను నిద్ర బాధించుచున్నదయ్య!
శయన గృహమును గట్టించుమయ!" యనియెను; 13.2

అనినయంతనె రావణుం డాజ్ఞ నిడఁగ,
విశ్వకర్మనుఁ బోలు శిల్పిగమి, యొక్క
యోజనమునకును ద్విగుణ యోజనముల
పొడవు వెడలుపు లున్నట్టి, పొలుపు మీఱు
ఘన గృహముఁ గట్టి, యిడెఁ గుంభకర్ణునకును! 13.3

స్ఫటిక కాంచన చిత్రిత స్తంభ ఘటిత
భాసితమ్ము, వైడూర్య సోపాన కృతము,
శింజినీ జాలకము, దాంత శిల్ప తోర
ణాన్వితమ్ము, వజ్రస్ఫటికాంచితంపు
టరుఁగు లలరె సుఖద మనోహర గృహమున! 13.4

మేరుపుణ్యగుహక్రియన్ మెఱయునట్టి
సకల సుఖకరమైన వేశ్మమ్మున నతి
బలుఁడు కుంభకర్ణుఁడు చేరి, బహు సహస్ర
వత్సరములు శయించి, తెర్వఁడయె కనులు! 13.5

కుంభకర్ణుఁ డా విధి నిద్రఁ గూఱియుండ,
నిచటఁ బౌలస్త్యుఁ డాపఁగ నెవరు లేక,
దేవమునియక్షగంధర్వదృఘువులపయిఁ
బడియుఁ బీడించె, దయలేనివాఁడునయ్యు! 13.6

అమిత కోపాన్వితుఁడయి దశాననుండు
నందనాదివిచిత్రవనమ్ములకును
జనియు, నన్నింటిఁ గూల్చెను జాలిలేక!
కోపమున్నట్టివారల నాపఁ దరమె? 13.7

నదుల యందునఁ గ్రీడించు నాగము వలె,
వర కుజమ్ములఁ బెకలించు వాయువు వలెఁ,
బర్వతముల ఱెక్కలఁ ద్రుంచు పవినిఁ బోలె,
దనుజుఁ డా రావణుఁడు వన ధ్వంసకుఁ డయె! 13.8

పంక్తికంఠుఁ డిట్లొనరుచు వార్త లెఱిఁగి,
యనుఁగుఁ దమ్మునిం గాంచు వంకనుఁ గొనియును,
ధనదుఁడౌ కుబేరుఁడు వంశ ధర్మనిరతి
దృష్టి నిడికొనియు, హితోపదేశమిడఁగ,
నతని లంకకు నొక దూత నంపె నపుడు! 13.9

ఆతఁ డట్టు లా లంకకు నరిగి, చన వి
భీషణుని గృహమ్మునకునుం, బ్రేమఁ జూపి,
యతని కాతిథ్య మిడి, వాని యాగతి వినఁ
బృచ్ఛసేసె విభీషణుం డిచ్చతోడ! 13.10

ధనదు క్షేమమ్ము నడిగి, యాతని స్వజనుల
నరసియు విభీషణుం డంత, నచట సభను
నగ్ర సింహాసనాసీనుఁ డగ్రజుఁ డగు
రావణుం జూపె దూతకుఁ బ్రమదమునను! 13.11

అచట స్వీయ తేజమ్ముతో నడరుచున్న
ప్రభుని రావణుం గని, జయధ్వానములనుఁ
దగు విధమ్మునఁ గీర్తించి, ధనదు దూత,
యుక్తి యుక్తుఁడు, క్షణకాల మూరకుండె! 13.12

అటు పయిని రాయబారి, వరాస్తరణ వి
శోభితోత్తమపర్యంకసుఖవిలాసుఁ
డైన రావణు, దశకంఠు, నసుర నృపునిఁ
గూర్చి యిట్టుల వచియించెఁ గూర్మిమీఱ! 13.13

"క్షితిప! మీ సోదరుఁడు వచించిన విషయము
నంతయును వచించెదనయ్య హర్ష మెసఁగ!
వీర! యిదియ మీ యుభయ సద్వృత్త వంశ
ములకు ననురూపమైనది పూర్ణముగను! 13.14

"సోదరా! యింతవరకీవు చూపినట్టి
ఘన కృతము లింకఁ జాలును! కంటిఁ దృప్తి!
నీకు సాధ్యమ్మె యైనచో, నీదు బుద్ధి,
ధర్మమార్గమ్మునకుఁ ద్రిప్పఁ దగును వత్స! 13.15

భగ్ననందనవనదృశ్యపంక్తిఁగంటి!
నీవు ఋషులఁ జంపించిన కృతము వింటి!
రాజ! నినుఁ గూల్పనున్న గీర్వాణ యత్న
మంతయును వింటి వత్స, నే నింతదాఁక! 13.16

ఈవు నను నిరాకృతుఁ జేసి తెన్నొమార్లు!
కాని, నిను బాలుఁ డని యెంచి, కనఁగనైతి!
బాలుఁ డపరాధముం జేయ, బందుగులును,
వానిఁ గావంగఁ దగుఁ గాదె, పలువిధముల? 13.17

ఇదే భావమున మఱియొక పద్యము:
[ ఏలిదమ్ముగఁ జూచితి చాలఁగ నను;
దాని సైఁచితిఁ జుమి నీవుఁ దమ్ముఁ డగుడు!
బాలుఁ డిల దుడుకైనను బంధుతతికిఁ
బాలనము సేఁత నీతియౌఁ బలువిధముల! ]

ధర్మసంసేవనము మదిఁ దలఁచి, వలచి,
నేను రౌద్రవ్రతమ్మును నిష్ఠతోడఁ
జేయఁగను జితేంద్రియుఁడనై, శీఘ్రగతిని
హిమనగోపరిసీమల కేఁగితినయ! 13.18

అచటఁ బార్వతీ సహితుఁడౌ నాదిదేవు
దర్శనము సేయ, నప్రయత్నముగ నపుడు,
నా యెడమ కంటి దృష్టియే, యా యమ పయిఁ
బడఁగ, హతవిధీ! దొసఁగునఁ బడితినయ్య! 13.19

ఇదే భావమున మఱియొక పద్యము:
[ అచటఁ బార్వతీ సహితుఁడౌ నాదిదేవు
దర్శనము సేసికొనుచుండ, దైవవశము
చేత, నా సవ్యదృ, క్కయ్యొ! చెలఁగి, పడియె
నచటి పార్వతీ దేవిపై నచ్చెరువున! ]

ఈమె యెవరను సందేహ మెసఁగు కతన,
నేనుఁ జూచితిఁ గాని, యింకేమి గాదు!
కనఁగ, సాటి లేనట్టిదౌ కమ్రరూప
మంది, పార్వతీ దేవియే యచట నుండె! 13.20

గౌరి దివ్యప్రభావంపుఁ గారణమున,
నాదు సవ్యేక్షణ మ్మప్డు బూది యయ్యుఁ,
బాంసుకణహతనయనమ్ముభాతిఁ గమరి,
పింగళపు వర్ణముం దాల్చె వేగముగను! 13.21

పిదప నే హిమగిరితటవిస్తృతంపు
టన్యదేశమ్మునకు నేఁగి, హరునిఁగూర్చి
యష్టశతవర్షమౌనతపోఽధికమునుఁ
జేసితిని భక్తి నిండార స్థిరముగాను! 13.22


ఇదే భావమున మఱియొక పద్యము:
[కాన, తద్గిరి నన్యశృంగమ్ముఁజేరి,
యచట భక్తి దైవారఁగ హరునిఁగూర్చి,
నూటయెనిమిదియేఁడులు గాటమైన
మౌనతపముఁ జేసితి నే ననూనముగను! ]

తన్మహేశ్వరవ్రతసమాప్తమ్మునందు
దేవదేవుఁ డానంద మందియును మదిని
వత్సలత ప్రకాశింపఁగా, వరమిడఁగను,
నన్నుఁ గూర్చియుఁ బ్రేమతో ననియె నిట్లు! 13.23

"ధర్మవిద! సువ్రత! కుబేర! ధనద! నీదు
ఘనతపమ్మునకునుఁ బ్రీతుఁడ నయితినయ!
యిట్టి వ్రతమును మొదటగా నేను సలిపి
తిని! యిపుడు నీవు నొనరించితివయ భువిని! 13.24

ఇట్టి వ్రత మొనర్పఁగ సమకట్టినట్టి
తొట్టతొలి పురుషుఁడ నేన! యిట్టిదాని
నాచరించిన రెండవ వ్యక్తి వీవ!
యిద్దఱమె! తృతీయుండు లేఁ డిలను! నిట్టి
దుష్కరవ్రతసృష్టికాద్యుఁడను నేనె! 13.25

ఇదే భావమున మఱియొక పద్యము:
[ ఇట్టి వ్రతమొనర్పఁగ సమకట్టినట్టి
తొట్టతొలి పురుషుఁడ నేన! తుట్టతుదిని,
రెట్టి వీవె! తృతీయుండు లేఁడు! ప్రథమ
దుష్కరవ్రతసృష్టికాద్యుఁడను నేనె! ]

అందుచే, నాదు సఖ్యమ్ము నందుకొనఁగఁ
దెలుపు మంగీకృతమ్ము, విత్తేశ! నీవు!
తపముచేతను నను గెల్చి, తనరుచుంటి!
కాన, ధనదుఁడ! నా చెలికాఁడవగుమ! 13.26

దేవి మహిమచే డాఁపలి దృక్కు కాలె
నెటులొ? దేవిఁ గాంచిన నేత్ర మెటులొ యిట్టి
పింగళపువర్ణమందె? నా భంగి నీకు
నలర "నేకాక్షిపింగళి" యనెడి నామ
మొదవు నీ భువిన్ శాశ్వతమ్ముగను, ధనద! 13.27

ఇటుల శంకరు స్నేహమ్ము నెసఁగ నంది,
యతని యాజ్ఞనుఁ బొందియు నాదృతిఁగొని,
తిరిగివచ్చిన నేనిట విరివిగాను
నీదు పాప కార్యములు వింటినయ వత్స! 13.28

కాన, కులమున కపకీర్తిఁ గలుగఁజేయు
నట్టి ధర్మవిరహితకృత్యములనుండి
మఱలుమయ్య! దేవర్షి సంహతియు నీదు
మారణోపాయమును రచింపంగనుండ్రి!" 13.29

అనఁగ విన్నట్టి రావణుం డాగ్రహకృత
రక్తలోచనుఁడై, హస్త రదనములను
మిగులఁ బీడితముం జేసి, మేఘగర్జ
వోలె నిట్టుల వదరెను పొగరు గదుర! 13.30

"దూత! నీవేమి యిటఁ బల్కితో దెలిసెను!
పలికినట్టి నీ వింకను బ్రతుకఁబోవు!
పలుకఁ బ్రేరేచినట్టి నా భ్రాత కూడ
బ్రతుకఁబోడయ్య! సత్యంపు వచనమిదియ! 13.31

ఆ కుబేరుని హితము నా కహిత! మీవు
మూఢుఁ డైనట్టి యాతఁడుఁ బొందినటుల
వినుచు "శివసఖిత్వ" మ్మది వినఁగ నాకు
నిఁక క్షమార్హమ్ము కాదోయి! హేయమోయి! 13.32

దూత! నే నింత దాఁకనుఁ దోడఁబుట్టు
వైన ద్రవిణేశు సహియించితయ్య! యతఁడు
నాకు నగ్రజుం డౌటచే "నన్నుఁ జంపఁ"
డనుకొనుచునుండె నో దూత! యదియ తప్పు! 13.33

వాని మాటలు నీదు ముఖాన వినిన
పిదప, మద్బాహువిక్రమ విపుల బల ప
రాక్రమములచే లోకత్రయాక్రమణముఁ
జేయవలెనని నిశ్చయించితిని నేఁడు! 13.34

ఆ ధనదుఁ డిట్లు పల్కించి నందువలన
నేనె, యీ క్షణమందుననే ధనదుని,
నతనితోఁ బాటుగా నల్వురైన లోక
పాలురనుఁ గూడ వధియింతు వైళమ యిఁక!" 13.35

అనుచు రావణుం డిటులు వల్కిన తదుపరి,
నిశిత ఖడ్గాన దూతను నిహతుఁ జేసి,
దుష్ట రాక్షస తతులకు నిష్టమైన
యామిషమ్మును భక్షింప నందఁజేసె! 13.36

అంతఁ బౌలస్త్యుఁ డప్డు స్వస్త్యయనుఁడయ్యు
వేగమే రథారూఢుఁడై వెడలె, మదినిఁ
గనుచుఁ ద్రైలోక్య విజయ లక్ష్యంపుఁ గాంక్ష,
ధనదుఁ డున్నట్టి దెసకు సంతస మెసంగ!"
నని యగస్త్యుఁడు రామునకు నిదె తెలిపె! 13.37

[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు నుత్తరకాండ మందలి త్రయోదశ సర్గ సమాప్తము]



స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి